Bandi Bhageerath | మేడ్చల్/కుత్బుల్లాపూర్/జగద్గిరిగుట్ట, హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): పొక్సో కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న బండి సాయిభగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడ వైద్యపరీక్షలు జరిపించారు.
అనంతరం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. గత డిసెంబర్ 31న భగీరథ్ తన స్నేహితులతో కలిసి బాధితురాలిని అరణ్య ఫామ్‌హౌస్‌కి తీసుకువచ్చి, అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకొనేందుకు నిందితుడిని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చిన పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలిసింది. ఆ రోజు ఏమి జరిగింది, ఫామ్‌హౌస్‌లో ఎవరెవరు ఉన్నారు? బాధితురాలిపై జరిగిన అఘాయిత్యానికి ఎవరెవరు సహకరించారు? బాధితురాలికి మద్యం తాగించడంలో ఎవరు కీలకపాత్ర పోషించారు? ఫామ్‌హౌస్‌లో ఎవరెవరు ఏయే గదుల్లో ఉన్నారు? మరుసటి రోజు ఫామ్‌హౌస్ నుంచి ఎక్కడికి వెళ్లారు? తదితర అంశాలను నిందితుడి ద్వారా సేకరించినట్టు తెలిసింది.
దాదాపు నాలుగు గంటల పాటు నిందితుడిని ఫామ్‌హౌస్‌లోనే విచారించిన పోలీసులు ఆ తరువాత షాపూర్‌నగర్‌లో ని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ సాయంత్రం వరకు విచారణ జ రిపిన అనంతరం పేట్‌బషీరాబాద్ ఠాణాకు తీ సుకెళ్లారు. రెండో రోజు విచారణలో భాగంగా గురువారం కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. మరో రెండు రోజులు కస్టడీ ఉన్న నేపథ్యంలో కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అయితే జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న తరువాత నిందితుడిని నేరుగా పీఎస్‌కు తరలిస్తారని పేట్‌బషీరాబాద్ ఠాణా వద్ద హడావుడి చేసిన పోలీసులు ఆ తరువాత మీడియా దృష్టిని మళ్లించి మొయినాబాద్ ఫామ్‌హౌస్, అక్కడి నుంచి డీసీపీ కార్యాలయానికి, చివరగా పీఎస్‌కు తరలించారు.