న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తొలిసారి తన వ్యక్తిగత జీవితంపై స్పందించబోతున్నారు. ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోనియా గాంధీ ఆత్మకథను తీసుకొస్తున్నట్టు ప్రచురణ కర్త ఆల్ఫ్రెడ్ బుధవారం తెలిపారు. సోనియా గాంధీ వ్యక్తిగత జీవిత విషయాలను ఆత్మకథగా తీసుకురావడం అంత సులభంగా జరగలేదని తెలిపారు.
మొదట్లో ప్రజా జీవితానికి దూరంగా ఉన్న తాను అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్టు సోనియా ఈ ఆత్మకథలో తెలిపారన్నారు. కొన్ని సంఘటనలు, నష్టాలు, కుటుంబ పరిస్థితులు తనను రాజకీయాల్లోకి లాగాయని సోనియా ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని తన వ్యక్తిగత విషయాలు, మనో వేదనలను సోనియా ఈ పుస్తకంలో పంచుకున్నారని ఆల్ఫ్రెడ్ వెల్లడించారు.