వరంగల్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహిళలపై అరాచకాలకు పాల్పడేవారే.. వారికి గౌరవాన్ని కల్పిస్తామంటే నమ్మేది ఎవరు? అతివల పట్ల, వారి మనుగడ పట్ల కనీస గౌరవం లేనివాళ్లు, ఉన్న చట్టాలకే విలువ ఇవ్వనివాళ్లు కొత్త చట్టాలను తెస్తామంటే నమ్మేది ఎవరు? వీళ్లా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేది? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి బాగోతం వెలుగుచూసినప్పటి నుంచి తెలంగాణవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశ్నల పరంపర ఇది.
‘అయ్య అంగడికిపోతే.. కొడుకు కోనేటికి పోతడా’ అన్నట్టు చిన్నప్పటి నుంచి తండ్రి తిట్లదండకమే తినుబండారంగా మలచుకొని పెరిగిన కొడుకు ఇట్లా చేయకపోతే ఇంకెట్ల చేస్తడు?’ అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలంటే తమకు ఎనలేని గౌరవం, అభిమానం ఉన్నదని నిరంతరం గొప్పలు చెప్పుకునే ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రి కుమారుడిపైనే పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం, అదీ ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చే ఒక్కరోజు ముందు వెలుగుచూడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ‘ఇటీవలి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశించాం.
కానీ తమ అసాధారణ, సాహసోపేత ప్రతిపాదనను విపక్షాలు వీగిపోయేలా చేశాయి’ అని ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా హంగామా చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనా, మాజీ మంత్రి గంగుల, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిలే లక్ష్యంగా బండి అనుచరులు చేసిన వీరంగంపైనా బీఆర్ఎస్ నాయకురాలు పావనిగౌడ్ బండి సంజయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బండి గ్యాంగ్ ఆమెను భయభ్రాంతులకు గురిచేశారు. మహిళలంటే లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూనే, మహిళాబిల్లుపై బీజేపీ మొసలి కన్నీటిని పట్టించుకోరని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.