హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23: ఆర్థిక సంస్కరణల దార్శనికుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. పీవీ నర్సింహారావు(PV Narasimha Rao) వర్ధంతి సందర్భంగా హనుమకొండ లోని పీవీ నర్సింహారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు నడిపిన అపూర్వ మేధావి, బహుభాషా పండితుడిగా, పరిపాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. తెలంగాణ బిడ్డగా దేశ ప్రధానిగా ఎదిగి, ప్రపంచ పటంలో భారతదేశానికి గౌరవం పెంచిన మహనీయుడని ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన నాయకుడు పీవీ నర్సింహారావు అని అన్నారు. యువత పీవీ నర్సింహారావు జీవితం నుంచి క్రమశిక్షణ, సహనం, దేశభక్తిని నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నొడితల సతీష్‌కుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ యూత్ రాష్ట్ర కార్యదర్శి పులి రజినీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పీవీ నర్సింహారావు విగ్రహానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.