హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న బీసీల్లో అత్యధిక జనాబా ముదిరాజ్లదేనని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని 4వేల మత్స్యకార సొసైటీల్లో 3,200 సొసైటీలు ముదిరాజ్‌ల చేతుల్లో ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చనున్నట్టు హామీ ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. బీసీ కమిషన్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రిపోర్టు తెప్పించుకొని, ఈ అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన జరిగిందని, ఆ డాటా ఆధారంగా వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. అంతకు ముందు ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు.