T PCC Chief | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాటాపై రాజీ పడటంతోనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టు పరిపూర్ణమైతే తెలంగాణకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొన్నది. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నది..’ ఇవీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన తాజా వ్యాఖ్యలు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షినటరాజన్‌తో కలిసి చేపట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాగునీటి రంగంపై కాంగ్రెస్ నేతల అవగాహనలేమిని ఈ వ్యాఖ్యలు మరోసారి బయటపెట్టాయి. బనకచర్ల ప్రాజెక్టు అంశం గత ఒకట్రెండు నెలలుగా రాష్ట్రంలో అగ్గి రాజేస్తున్నది.
మేధావులు, సాగునీటి రంగ నిపుణులే కాకుండా, కళాశాల నుంచి క్యాంపస్ వరకు ఏ ఒక్క విద్యార్థినీ, విద్యార్థులను అడిగినా బనకచర్ల ప్రోగ్రెస్ రిపోర్టును గుక్కతిప్పుకోకుండా చెబుతారు. కానీ, అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ మాత్రం 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు.. బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందని చెప్పడంపై సోషల్‌మీడియాలో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ సమాజంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి బనకచర్లపై కమిటీని ప్రతిపాదించి, సంతకం చేసి తెలంగాణకు ద్రోహం చేశారంటూ మండిపడుతుంటే, మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మాత్రం కిందిపడినా తమదే పైచేయి అన్నట్టు ఆ నెపాన్ని బీఆర్ఎస్పై నెడుతుండటంపై నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.