హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం ఎజెండా నుంచి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదని, కాబట్టి చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టంచేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర జల్‌శక్తి శాఖకు ఈ మేరకు లేఖ రాశారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను అందులో ప్రస్తావించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనే చర్చించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీలో ఇరు రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, ఏకపక్షంగా బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకు పోతున్నదని, దీనిపై ఇప్పటికే అనేకసార్లు అభ్యంతరాలను తెలియజేశామని సీఎస్ గుర్తుచేశారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు రాలేదని, ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు)లో అనేక లోపాలు ఉన్నాయని వెల్లడించారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి టీవోఆర్ జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) సైతం ఏపీ ప్రతిపాదనలను తిరసరించిందని వివరించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర నియంత్రణ సంస్థలైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సైతం అభ్యంతరం తెలిపాయని పేర్కొన్నారు.