హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. వాచీలపై నిషేధం విధించిన నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలిచ్చింది. పరీక్షాకేంద్రాల్లో ప్రతి గదిలో ఒక వాచీని ఏర్పాటు చేయాలని, ఒక్కో వాచీని రూ. 100తో కొనుగోలు చేయవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య శనివారం ఆదేశాలిచ్చారు.
సోమవారంలోగా పరీక్షాకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడు గంటలపాటు పరీక్షలను నిర్వహించడంతో సమయం తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల్లో గడియారాలు లేకపోవడం, అప్రమత్తం చేయకపోవడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇదే విషయంపై ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.
స్పందించిన ఇంటర్‌బోర్డు తాజాగా వాచీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. రూ. వందకు వాచీలు మార్కెట్లో దొరుకుతాయా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్ పరీక్షా హాళ్లల్లో గోడ గడియారాల ఏర్పాటును తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజేఎల్ఏ)-475 స్వాగతించింది. ఒక్కో వాచీ రూ. వందకు రాదని, ఇంటర్ విద్య అధికారులే బల్క్‌గా కొని పరీక్షాకేంద్రాలకు అందజేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు వస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కే సురేశ్ కోరారు.