TGHEC | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ) : క్లాస్రూముల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టకుండా నిత్యం సెల్ఫోన్ వినియోగిస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకుల ఏకాగ్రతకు భంగం కలుగడంతోపాటు బోధనకు అంతరాయం కలుగుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో సెల్ఫోన్ల వాడకాన్ని కట్టడి చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
త్వరలోనే యూనివర్సిటీ, కాలేజీల యాజమాన్యాలతో సమావేశమై చర్చించనున్నట్టు సమాచారం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నది. విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లేముందు సెల్ఫోన్లను కార్యాలయాల్లో భద్రపరుచుకునేలా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. బ్రేక్టైంలో, తరగతులు పూర్తైన తర్వాతే సెల్ఫోన్లను తీసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు.