GP Layouts | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): కొన్నేండ్ల క్రితమే గ్రామ పంచాయతీ అనుమతులతో వేసిన లేఅవుట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. ఆ లేఅవుట్లలో ప్లాట్ల యజమానులను ముప్పుతిప్పులు పెట్టేలా రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ఆ మేరకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో నిషేధించిన జీపీ లేఅవుట్ల జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వరకు పలు మండలాల పరిధిలో విస్తరించిన జీపీ లేఅవుట్లను సర్వే నంబర్లతో సహా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే కొనుగోలు చేసే ప్లాట్లను లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు చర్యలకు దిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో వందలాది లే అవుట్లు అనధికారికంగా మారనున్నాయి. జీపీ లే అవుట్లను 22-ఏ (1)(ఈ) ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చారు.హెచ్ఎండీఏ పరిధిలో ప్రధానమైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే నంబర్ల వారీగా గ్రామపంచాయతీ లేఅవుట్లపై నిషేధిత జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో ప్రధానంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే 474కు పైగా లేఅవుట్లు ఉన్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో మరో 100, సంగారెడ్డి జిల్లాలో వందకు పైగా జీపీ అనుమతులతో వేసిన లేఅవుట్లను నిషేధించినట్టు తెలిసింది. ఈ జాబితాను హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపరిచి.. ఇప్పుడు ఆ వెబ్సైట్ లింకులను తొలగించేశారు. ఒక్కో లేఅవుట్లో 20 నుంచి 50 ప్లాట్ల వరకు ఉండటంతో అటు డెవలపర్లు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
హెచ్ఎండీఏలో స్పందన కరువు
నిషేధించిన జీపీ లేఅవుట్ల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో కొందరు కొనుగోలుదారులు హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికి క్యూ కడుతున్నారు. కానీ హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. హెచ్ఎండీఏ కంటే ముందున్న హుడా సమయంలోనే వెలిసిన జీపీ లేఅవుట్లు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. అన్ని అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా డెవలప్ చేసిన లేఅవుట్లను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కాంగ్రెస్ కుట్రలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ రద్దు చేసి, జీపీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్ల క్రయవిక్రయాలకు అనుమతించాలని, నిషేధిత జాబితా పేరిట పేద, మధ్యతరగతి వర్గాలను భయభ్రాంతులకు గురి చేయవద్దని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.