హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్‌కు సంబంధించిన చిక్కుముడి వీడకపోయినా, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఒక్కొక్కటిగా సిద్ధం చేస్తున్నది. ఎన్నికల నిర్వహణలో ప్రధానమైన బ్యాలెట్ బాక్సులను రెడీ చేస్తున్నది. గుజరాత్ నుంచి 37,530, మహారాష్ట్ర నుంచి 19,450 బ్యాలెట్ బాక్సులను తెప్పించింది. ఆయా రాష్ర్టాల నుంచి వచ్చిన బాక్సులు ఏ జిల్లాలకు ఎన్ని అనే లిస్టులను తయారుచేసి అధికారులకు అందజేశారు. మొత్తం 31 జిల్లాలకు బాక్సులను ఇప్పటికే కేటాయించారు. వాటిని ఆయా జిల్లాలకు రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 74,903 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఇప్పుడు రాష్ట్రంలో 1,31,883 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీ వార్డులు 1,12,534 ఉన్నట్టు అధికారులు తేల్చారు. సుమారు 20 వేల బాక్సులు అదనంగా ఉన్నాయి. ఒకవేళ ఒకేసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా సరిపడా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేసి పెట్టారు.
రిజర్వేషన్లపై నేటికీ తేల్చని సర్కారు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 రిజర్వేషన్లపై సర్కారు నేటికీ తేల్చకపోవడం ఎన్నికల ప్రక్రియకు ప్రతిబంధకంగా మారింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ. 2,700 కోట్లు నిలిచిపోయాయి. ప్రతినెలా రూ.180 కోట్లు రాష్ర్టానికి రాకుండాపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ ఫైనాన్స్ నిధుల (ఎస్ఎఫ్సీ)ను విడుదల చేయడంలేదు. సుమారు 13 నెలలుగా రూ.1,560 కోట్లు గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉన్నది. ఇలా ఎక్కడి నిధులు అక్కడే ఆగిపోవడంతో నిధులు లేక గ్రామ పంచాయతీలు సమస్య సుడిగుండంలో చిక్కుకున్నాయి. వర్షాల నేపథ్యంలో కనీస పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా పంచాయతీ వద్ద నిధులు లేవు. ఇప్పటికే తమ సొంత డబ్బులు వెచ్చించి అత్యవసర పనులు చేపడుతున్నామని పంచాయతీ కార్యదర్శులు చెప్తున్నారు. త్వరలో జరిగే రాష్ట్ర క్యాబినెట్ భేటీలో రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.