హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, రేవంత్‌రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. కమీషన్లు తీసుకోవడం, కమిషన్లు వేయడం.. కాంగ్రెస్ సర్కారు తీరు గా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపైన విద్వేషంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. శనివారం తెలంగాణభవన్‌లో మా జీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీ రాకేశ్‌కుమార్‌తో కలిసి బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నదని గుర్తు చేశారు. ఏ శాఖలో కూడా పరిపాలన సరిగా సాగడంలేదని చెప్పారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయంలోనూ ఆ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు.
ఏ శాఖపైనా సమీక్ష లేదు..
వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా సీఎం రేవంత్ ఇంత వరకు ఆ శా ఖపై సమీక్ష నిర్వహించలేదని బాల్క సుమన్ మండిపడ్డారు. వానకాలం సీజన్ రైతు బంధు వేయడం ఇంకా ప్రభుత్వం ప్రారంభించలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సీఎం సొంత జిల్లాలోనే పట్టపగలు ఒక వ్యక్తిని కొట్టి చంపారని తెలిపారు.