హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): దళితులంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిన్నచూపేనని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న మంత్రి పొంగులేటిని కాపాడేందుకు కడియంను అడ్డుపెట్టుకొని, కౌశిక్‌రెడ్డి భుజంపై తుపాకీపెట్టి దళితులపై కాల్పులు జరుపుతున్నారని మండిపడ్డారు. దళితులకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చి ఉద్దరించినట్టు అసెంబ్లీలో పోజులుకొట్టారని దుయ్యబట్టారు. కానీ దళితులకిచ్చిన హామీలను అటకెక్కించారని విరుచుకుపడ్డారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నేతలు కురువ విజయ్‌కుమార్, మహిపాల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
హామీలను గాలికొదిలిన కాంగ్రెస్.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకు కుట్రలకు దిగుతున్నదని బాల్క సుమన్ ఆరోపించారు. 128 మంది గురుకుల పిల్లల మరణానికి కారణం కాంగ్రెస్సేనని విమర్శించారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో చిన్నారి మృతిపై సమీక్షించేందుకు తీరికలేని వివేక్ తన కంపెనీలపై నిత్యం సమీక్షిస్తుంటారని విరుచుకుపడ్డారు.
వెలుగుమట్ల నుంచి వట్టినాగులపల్లి వరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ భూదందాలకు పాల్పడుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన అక్రమాలపై అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుదాడికి దిగి తప్పించేందుకు యత్నించారని విమర్శించారు. పాడి కౌశిక్‌రెడ్డి ఏదో అన్నారని నెపంవేసి దళిత సభ్యులను అడ్డంపెట్టుకొని రాజకీయం చేశారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలపై నిలదీసిన ప్రతిపక్ష సభ్యులను ‘పండబెట్టి తొక్కుతా’ అని మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే దళితులకు సముచిత గౌరవం లభించిందని బాల్క సుమన్ స్పష్టంచేశారు. దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చి వారి బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. దేశంలోనే ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రతిష్టించి, సెక్రటేరియట్‌కు ఆయన పేరుపెట్టి ఆ మహానేతపై గౌరవాన్ని ఎలుగెత్తిచాటారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఏవో నాలుగు పదవులిచ్చి గొప్పలు చెప్పుకోవడం శోచనీయమని ఎద్దేవాచేశారు.
‘ముగ్గురు దళిత మంత్రుల్లో ఒకరు 20 శాతం కమీషన్లు దండుకుంటున్నడు.. ఇంకో మంత్రి వ్యాపారాలు చక్కదిద్దుకుంటున్నడు..ఇంకొక మంత్రి ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు.. ఇలాంటి వాళ్లకు పదవులిచ్చి దళితసమాజాన్ని ఉద్ధరించామని చెప్పుకుంటున్నరు’ అని తూర్పారబట్టారు.
దళితుడనైన తనను 16 రోజులు జైల్లో పెట్టిన ప్రభుత్వ పెద్దలు దళితులపై లేనిప్రేమను ఒలకబోస్తున్నారని చెప్పారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను అక్రమపద్ధతుల్లో కైవసం చేసుకొనేందుకు ఎత్తులు వేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నిక నిర్వహించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు.