హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమని, సూట్‌కేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో ఎమ్మె ల్యే వివేక్ జైలుకు పోక తప్పదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. ఎమ్మెల్యే వివేక్‌ను సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రేవంత్‌రెడ్డే కాదు.. దేవుడు కూడా వివేక్‌ను కాపాడలేరని పేర్కొన్నారు. తెలంగాణలో కొం దరు పోలీస్ అధికారులకు స్వామిభక్తి ఎకువైందని, రేవంత్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. ఈకేసును ఈడీ దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పోలీసులు కేసును ముగించే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు లో హైకోర్టు, అవసరమైతే సుప్రీంకు వెళ్తామని పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివేక్ తన విశాఖ కంపె నీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ అనే సూట్‌కేస్ కంపెనీకి రూ.8 కోట్లు అక్రమంగా బదిలీ చేసి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచినట్టు తాను ఆనాడే ఈసీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఐటీ, ఈడీతోపాటు రాష్ట్ర పోలీసులకు సైతం విచారణ జరపాలని ఆదేశా లు జారీచేసిందని తెలిపారు. వివేక్ సూట్‌కేసు కంపెనీకి అక్రమంగా నగదు బదిలీ చేశారని, ఫెమా ఉల్లంఘనలు ఉన్నాయని 2023 నవంబర్ 23న ఈడీ ప్రెస్‌నోట్‌లో నిర్ధారించినట్టు పేర్కొన్నారు. ఆ ప్రెస్‌నోట్‌ను సుమన్ మీడియాకు చూపించారు. జనవరి 24న వివేక్‌ను ఈడీ విచారించిందని వెల్లడించారు. ఈడీ విచారణ కొనసాగుతుంటే పోలీసులు మాత్రం ఆగస్టులో ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మూసి వేస్తున్నట్టు కోర్టుకు పిటిషన్ ద్వారా తెలిపారని మండిపడ్డారు. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ నాంపల్లి కోర్టులో శుక్రవారం ప్రొటెస్ట్ పిటిషన్ వేశామని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి దగ్గర హోంశాఖ ఉంది కనుక వివేక్‌ను కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ విషకౌగిలిలో బందీ కావద్దు
రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సా హం ప్రదర్శిస్తున్నారని, రేవంత్‌రెడ్డి విషకౌగిలిలో పోలీసుల బందీ కావొద్దని బాల్క సుమ న్ సూచించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏది చెబితే పోలీసులు అది చేస్తారా? అని ప్రశ్నించారు. ఇన్‌కం ట్యాక్స్, ఈడీ లోతైన విచారణ చేస్తుంటే రాష్ట్ర పోలీసులు వివేక్ కేసును ఎలా మూసేస్తారు? అని నిలదీశారు. ఏపీలో ఏం జరుగుతున్నదో ఇకడి పోలీసు అధికారులు చూడటం లేదా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులకు భవిష్యత్తులో నష్టం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు రాంచందర్‌రావు, మన్నె గోవర్ధన్‌రెడ్డి, పార్టీ లీగల్ టీమ్ సభ్యులు జకుల లక్ష్మణ్యదవ్, కల్యాణ్, లలితారెడ్డి, గోపగాని రఘురామ్ పాల్గొన్నారు.