హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 20 ఏండ్లు వెనక్కి వెళ్లిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి, కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని.. హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. సినీనటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టిన హైడ్రా.. హిమాయత్‌సాగర్‌లోని ఆనంద్ కన్వెన్షన్‌ను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు. నాగార్జునను రూ.400 కోట్లు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చారని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయని వెల్లడించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ 18 ఎకరాల ఫాంహౌస్ కూల్చడానికి బుల్డోజర్లు దొరకటం లేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ నేతల ఫాంహౌజ్‌లు కూల్చబోరని, పేదల ఇండ్లు మాత్రమే కూల్చుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడవటం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్‌గాంధీది ఒక విధానం, రేవంత్‌రెడ్డికి ఇంకో విధానం అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావొస్తున్నా మ్యానిఫెస్టో హామీల అమలుపై దృష్టిపెట్టడం లేదని విమర్శించారు.
‘మ్యానిఫెస్టో అంశాలు చర్చకు రాకుండా ప్రజల దృష్టి మళ్లించే పనిలో సీఎం బిజీగా ఉన్నారు. 9 నెలలైనా ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు. రుణమాఫీ చేసింది రూ.17,933 కోట్లే. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయనేది ఇంతవరకు ప్రకటించలేదు. వానకాలం ముగియవస్తున్నా రైతుబంధు పడలేదు. రాష్ట్రంలో సునీల్ కనుగోలు స్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం, హైడ్రా డ్రామాలు నడిపిస్తున్నాయి’ అని మండిపడ్డారు.
ఇక, కేసీఆర్, కేటీఆర్‌తో పాటు తమ నాయకుల వ్యక్తిత్వాలపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారని, రేవంత్ టీమ్‌లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నోముల భగత్, దాసోజు శ్రవణ్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, చాడ కిషన్‌రెడ్డి, తుంగ బాలు, యాకుబ్‌రెడ్డి పాల్గొన్నారు.