హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : ‘మేము చెప్పేది వినాలి అంతే. పార్టీల ప్రతినిధులు మాట్లాడొద్దు. మీ ఇష్టం ఉంటే ఉండండి.. లేదా వెళ్లిపోండి’ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధు లు సోమ భరత్, దేవీ ప్రసాద్, దూదిమెట్ల బాలరాజుయాదవ్ విమర్శించారు. పార్టీలు చెప్పేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వినడం లేదని, ఎన్నికల్లో జరిగే అవకతవకలపై ఫిర్యాదులు స్వీకరించలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏసీగార్డ్స్‌లోని ఎస్ఈసీ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణికుముదిని రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలతో గురువారం సమావేశం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, జనసేన, టీడీపీ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు డ్రాఫ్ట్, పోలింగ్ స్టేషన్ల వివరాలు, నిర్వహణ తదితర అంశాలపై ఎస్ఈసీ అధికారులు చర్చించారు. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలోని 366 వార్డులు, 117 మున్సిపాలిటీల పరిధిలోని 2,630 వార్డులకు ఓటర్ల తుదిజాబితాను మున్సిపల్ కమిషనర్లు 16న అధికారికంగా ప్రచురిస్తారని వెల్లడించారు.
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సవరించిన సెక్షన్ 195-ఏ ప్రకారం ఎన్నికల ప్రక్రియను చేపడుతున్నట్టు ఎస్ఈసీ రాణికుముదిని వివరించారు. ఈ క్రమంలో నల్లగొండ కు మున్సిపాలిటీగానా లేదంటే కార్పొరేషన్‌గా ఎన్నికలకు వెళ్తారా? అని బీఆర్ఎస్ ప్రతినిధులు కమిషనర్‌ను అడగడంతో కమిషనర్ తీవ్ర అసహనానికి గురై ‘మేము చెప్పేది వినా లి అంతే తప్ప పార్టీల ప్రతినిధులు మాట్లాడొ ద్దు. ఇష్టం ఉంటే ఉండండి. లేకపోతే స మావేశం నుంచి వెళ్లిపోచ్చు’ అని పేర్కొన్నారు.
పొలిటికల్ పార్టీలు చెప్పేది వినకుండా ఎస్ఈసీ తమతో దురహంకారంగా , రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ విమర్శించారు. ఏది చెప్తే అది వినిపోవాలని ఆర్డర్స్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడారు, ప్రజాస్వామ్యంలో అలాంటి పద్ధతి ఉంటుందా? అని అసహనం వ్యక్తం చేశారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకునే దానికి తాము రావాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నది ఆయన ధ్వజమెత్తారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటరు లిస్టే ఇంకా ప్రిపేర్ కాలేదని, ఇంకెప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ ప్రతినిధి దేవీప్రసాద్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీగా తమకు అనుభవాలు ఉన్నాయని, క్షేత్రస్థాయి తప్పిదాలను ఎస్ఈసీ వద్ద ప్రస్తావించినా పట్టించుకోకుండా చెప్పిందే విని వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారని ఆక్షేపించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు చేసిన తప్పిదాలను ప్రస్తావించగా ఎన్నికల కమిషనర్ పట్టించుకోలేదని బీఆర్ఎస్ ప్రతినిధి దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఆరోపించారు. కొందరు అధికారులు కాంగ్రెస్‌కు తొత్తుగా మారారని అసహనం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపాలని ఎస్ఈసీని కోరినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించిందని తెలిపారు. ఓటరు లిస్టు ప్రక్రియ ఆలస్యమైతే షెడ్యూల్లో మార్పు చేయాలని కోరినట్టు వెల్లడించారు.