మూసాపేట, డిసెంబర్ 28 : లైంగికదాడికి గురై మృతిచెందిన దళిత యువతి కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసానిచ్చారు. ఈ నెల 17న లైంగికదాడి, హత్యకు గురైన మహబూబ్నగర్ జిల్లా వేములకు చెందిన దళిత యువతి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. యువతి చిత్రపటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులతో మాట్లాడి ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతురాలి తండ్రికి రూ.3.47 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ వేములలో యువతిపై సామూహిక లైంగికదాడి జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. నిందితుడిని వెంటనే కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఎస్పీ, డీఎస్పీకి ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి దోషులకు శిక్షపడేలా చూస్తామని తెలిపారు.