ఖలీల్‌వాడి, జనవరి 7: హామీలు అమలు చేయలేని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతుండు. ప్రభుత్వాన్ని నడపడం చేతకాక, కేటీఆర్ మీద పడుతుండు. 6 గ్యారెంటీలను గంగలో కలిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు అని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి రెండు అధిష్ఠానాలు ఉన్నాయని, ఒకటి ఏఐసీసీ అయితే, మరొకటి బీజేపీ అని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్‌ను నిర్వహించి హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కేటీఆర్‌ది అని గుర్తుచేశారు.
ఈ రేసుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంలో అప్పుడు పని చేసిన అరవింద్‌కుమార్ సహా ఇతరులపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ రేసులో పాల్గొన్న సంస్థలపై కేసు పెట్టే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా? అని నిలదీశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పదేండ్లలో రూ.4 లక్షల కోట్లు అప్పు తెచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, దళితబంధు, మిషన్ భగీరథ వంటివెన్నో ప్రవేశపెట్టారని తెలిపారు. ఏడాది పాలనలోనే రేవంత్‌రెడ్డి రూ.1.27 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడని, ఆ నిధులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు, అప్పుల గురించి ప్రశ్నిస్తున్న కేటీఆర్, కవిత, హరీశ్‌రావు గొంతులను ఏసీబీతో నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.