హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : రోడ్లు భవనాల శాఖలో సుమారు రూ.18 వేల కోట్ల విలువయ్యే పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ఆవేదన వ్యక్తంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో కూడా రూ.10 వేల కోట్ల పనులు జరుగుతుంటే ఇప్పటివరకు కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే చెల్లించినట్టు తెలిపింది. పరిస్థితి ఇలాగే ఉంటే జరుగుతున్న పనులకు పేమెంట్లు వచ్చేందుకు ఆరేడేండ్లు పడుతుందని వాపోయింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. ‘ఉద్యోగులను ఉద్దేశించి మీరు చేసిన ఉపన్యాసంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయాలను మీడియాలో చూశాం. వివిధ శాఖల్లో ఆర్థిక అంచనాలకు మించి పనులు చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు ఎలా అయితే ఆవేదన చెందుతున్నారో.. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్నామంటే మాకు కూడా అప్పులు పుట్టక అదేవిధంగా ఆందోళన చెందుతున్నాం. అయినా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పనులు పూర్తిచేయాలని మాపై ఒత్తిడి తెస్తున్నారు.
వారి ఒత్తిడితో మేము గుండెలు ఆగిపోయే దుస్థితికి వచ్చినం. బిల్లులు రాక ఆందోళన చెంది ఇటీవల ఆదిలాబాద్‌కు చెందిన ప్రవీణ్ అనే యువ కాంట్రాక్టర్ గుండె ఆగిపోయి చనిపోవడమే ఇందుకు నిదర్శనం. మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూశాక ఎన్నోసార్లు ప్రభుత్వానికి సూచన చేద్దామనుకున్నా మా సూచన వినేవారు లేరు. అందుకే ఈ లేఖ ద్వారా మా బాధలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నం.
వివిధ శాఖల వారీగా జరిగే పనుల మీద ఒకసారి సమీక్ష పెట్టి, ప్రభుత్వం ఏ సంవత్సరం ఎంత పేమెంట్ ఏ ఏ శాఖలకు ఇవ్వగలుగుతుందో, ఏ ఏ పనులు చేపట్టాలో నిర్ణయిస్తే సమస్యకు కొంతైనా పరిషారం దొరుకుతుందని భావిస్తున్నాం. ఇప్పుడున్న బకాయిలను ఎన్ని రోజుల్లో చెల్లిస్తరు? సమాన నిష్పత్తిలో చెల్లింపులు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. మేము సుమారు మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, 10 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. మమ్ములను రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గవర్నమెంట్ కాంట్రాక్టర్ల గుండె చప్పుడు’ అని సీఎంకు రాసిన లేఖలో బీఏఐ వివరించింది.