కొడంగల్ కోస్గి మద్దూరు, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులోఅరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. రైతులు తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు అర్ధరాత్రి పోలీసులు ఐదు గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్టు చేశారు.
ఆనాటి నుంచి ఆ 5 గ్రామాలు నిర్మానుష్యంగా మారి, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని రోటిబండతండా, పులిచెర్లకుంటతండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సంబురాలు చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గి పట్టణాల్లో బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి చేరి పటాకులు కాల్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో ఆరుగురికి హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలు చొప్పున వ్యక్తిగత హామీ ఇవ్వాలని, రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలని, దర్యాప్తుకు సహకరించాలని సూచించింది. వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూసేకరణకు నిరాకరించిన రైతులు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగగా తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు అక్టోబర్ 25న బొమ్మరాస్పేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ లగచర్లకు చెందిన గోపాల్ నాయక్, విజయ్, సేవానాయక్, రామునాయక్, ప్రదీప్, లక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. వీటిని బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, ముందస్తు బెయిలు మంజూరు చేశారు. ఈ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆర్మీ మాజీ అధికారి కావలి శేఖర్ వ్యాజ్యాన్ని కూడా విచారించిన న్యాయమూర్తి పిటిషనర్‌ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగించవచ్చునని చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతులకు బెయిల్ రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. లంబాడా రైతులకు మనో ధైర్యాన్ని ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మద్దతుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ ఇవ్వడం చారిత్రాత్మకమైన సత్యమని, సత్యమేవ జయతే సత్యమేవ జయతే అనే మాటకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. చట్టాన్ని పరిరక్షిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, చట్టాన్ని తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డికి ఒక్కక్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు.
తెలంగాణభవన్‌లో బుధవారం రాత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ ‘2013 భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలి. కానీ తరతరాల నుంచి వస్తున్న గిరిజనుల భూములను బలవంతంగా గుంజుకోబోయారు. అర్ధరాత్రి కరెంట్ తీసేసి పోలీసులు ఇండ్లపై దాడిచేసి అరాచకం సృష్టించారు. చివరికి రైతుకు గుండెపోటు వచ్చినా బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లారు. ఇలా నిరంకుశంగా వ్యవహరించిన రేవంత్ సర్కారు తీరుకు న్యాయస్థానం ఈ రోజు ఇచ్చిన తీర్పు చెంపదెబ్బ వంటిది. రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేసి ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని పొన్నాల డిమాండ్ చేశారు.
నా భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నేను నిండు గర్భిణిని. ఎప్పుడు ఏ సమయంలో పురిటినొప్పులు వస్తా యో, ఎవరి సహాయంతో దవాఖానకు వెళ్లాలో అనే భయం ఉండేది. న్యాయం కోసం నిండు గర్భిణిని అయినా ఢిల్లీ వరకు వెళ్లి వచ్చా. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం మా ఇంట్లో అత్తామామయ్య మాత్రమే ఉన్నారు. బెయిల్ మంజూరై నా భర్త ఇంటికి వస్తున్నాడంటే చాలా ఆనందంగా ఉన్నది. నాకు పుట్టబోయే బిడ్డ అదృష్టమని భావిస్తున్నా.
-జ్యోతి, పులిచర్లకుంటతండా వాసి
మా మామయ్య జైలుకు వెళ్లక ముందు పూర్తి ఆరోగ్యంగా ఉండి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేవాడు. జైలుకెళ్లిన తర్వాత భయంతో ఆయనకు గుండెపోటు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చికిత్స అందించారో తెలియదు. ఆ భగవంతుడి దయవల్ల ఇప్పుడు ఆయన ఇంటికొస్తున్నారు. గుండెపోటు రావడం బాధగా ఉన్నా జైలు నుంచి ఇంటికి వస్తుండటం ఆనందంగా ఉన్నది.
-కవిత, పులిచెర్లకుంటతండా వాసి