హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ శనివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ సీజన్లో రైతుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, గడిచిన 15 రోజుల్లో ఇప్పటివరకు కేవలం 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ స్వయంగా ప్రకటించడం ధాన్యం కోనుగోలు ప్రక్రియలో జాప్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నెలరోజుల్లో ఇంకా మిగతా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో పూర్తిస్థాయిలో మక్క దిగుబడులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.