ఏటూరునాగారం : అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు ఇల్లు నిర్మించి సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గం ఇన్చార్జి బడే నాగజ్యోతి ప్రశ్నించారు. ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు సమీపంలోని ఆదివాసులు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేయడంపై నాగజ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సంబందిత ఆదివాసీ కుటుంబాలను ఆమె పరామర్శించి ధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అడవి పై ఆధారపడి జీవించే ఆదివాసులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లలో ఉండగానే అటవీశాఖ అధికారులు యంత్రాలతో కూల్చివేసేప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన హామీలు మర్చిపోయారా అంటూ మంత్రి సీతక్కను ప్రశ్నించారు.
జీవించి హక్కును అధికారులు కాలరాస్తున్నారని ఆదివాసులు జీవించకూడదా అంటూ ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆదివాసులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ , మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఖాజా పాషా, దున్నపునేని కిరణ్, కాళ్ళ రామకృష్ణ, కుమ్మరి చంద్రబాబు, ఆదివాసీలు, తదితరులు పాల్గొన్నారు.