Bade Nagajyothi | ములుగు, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య సమస్యతో సోమవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి వైద్యం కరువైంది. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఈ రోజు చూడబోమని, రేపు రావాలని నిర్లక్యంగా చెప్పారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తంచేస్తూ.. సామాన్య ప్రజలకు అందుతున్న ప్రభుత్వ వైద్యంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. తనకు కుడి చెవి కింది భాగంలో గాలి బుడగలా వచ్చిందని, జ్వరం సైతం వస్తున్నదని ములుగు ప్రభుత్వ దవాఖానకు వచ్చానని తెలిపారు. విధుల్లో ఉన్న వైద్యురాలు భవాని మామూలు జ్వరమే కదా.. అదేమన్న పెద్ద రోగమా? ఇవాళ చూడలేం.. రేపు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పిందని వాపోయారు.
జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన తనకే ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందకపోతే సామాన్య, పేద ప్రజల పరిస్థితి ఏంటని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వాపోయారు. వైద్యం కోసం వస్తున్న ప్రజలను చూస్తున్నారా? అనేది అర్థం కావడం లేదని, ఇంత దారుణంగా దవాఖాన నిర్వహణ ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు. దవాఖాన సూపరింటెండెంట్, మంత్రి, మిగిలిన వారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. దవాఖాన సిబ్బంది కనీస మర్యాద ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ములు గు ప్రభుత్వ దవాఖానలో వైద్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని నాగజ్యోతి డిమాండ్ చేశారు.