సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లాలు పంచాయతీ సెక్రెటరీ (Panchayati Secretary) మిస్సింగ్ కలకలం రేపుతుంది. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో గ్రామపంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియాంక తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తిరుపతికి బయలు దేరారు.
కాగా ప్రియాంకను బద్దనపల్లిలో కొందరు విధుల్లో వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇంకుడు గుంతల బిల్లులు చెల్లింపులపై అందరి ముంగటే పంచాయతీ సెక్రెటరీని దూషించినట్లు సమాచారం. దీంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై కాంగ్రెస్ నేతలు తాము చెప్పిన పేర్లే ప్రకటించాలని, గ్రామసభ లేకుండానే ఎంపిక చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితా ఎంపీడీవోకు అందించాల్సి ఉండగా, ప్రియాంక మండల పరిషత్ కార్యాలయానికి రాలేకపోయింది. వాట్సాప్ గ్రూప్లో తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్ పంపి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.
దీంతో ఇటు ఉద్యోగులు, అటు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంపీడీవో లక్ష్మీనారాయణ వివరణ కోరగా.. సోమవారం మధ్యాహ్నం తనకు వాట్సప్ ద్వారా రాజీనామా చేస్తున్నట్లు లేకను పోస్ట్ చేసిందన్నారు. తర్వాత ఫోన్ చేయగా స్విచాఫ్ ఉందని తెలిపారు. డీపీఓను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లు వెల్లడించారు.