హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్లు కరిగించే మందులు అంటూ ప్రచారం చేయడం నిషేధమని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో ఆర్ఎస్ యునానీ ఫార్మసీపై సోమవారం డీసీఏ అధికారులు దాడులు చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా ‘యూనీ స్టోన్స్’ పేరుతో కిడ్నీలో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు కరిగించే మందులు అంటూ అమ్ముతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. వీటిపై బహదూర్‌పురా ఆర్ఎస్ యునానీ ఫార్మసీలో తయారు చేసినట్టు ఉన్నదని, దీంతోపాటు రెనోనిప్ డ్రాప్స్ పేరుతో కిడ్నీలో రాళ్లు కరిగించే హోమియోపతి మందుగా ప్రచారం చేస్తున్నట్టు తేలిందని వివరించారు.
నిబంధనల ప్రకారం కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్లు కరిగిస్తామని ప్రచారం చేయడం నిషేధమని చెప్పారు. సాధారణంగా గాయాలను శుభ్రం చేయడానికి వినియోగించే ‘హైడ్రోజన్ పెరాక్సైడ్’ను ల్యాబొరేటరీ రియేజెంట్గా పేర్కొంటూ అమ్మడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. దీనిపై ‘హైడ్రోజన్ పెరాక్సైడ్ ఐపీ’ అని కచ్చితంగా ఉండాలని స్పష్టంచేశారు.
ఎమ్మార్పీ సైతం ప్రభుత్వం నియంత్రించిన మేరకే ఉండాలని పేర్కొన్నారు. కొందరు తయారీదారులు ల్యాబ్ రియేజెంట్గా పేర్కొంటూ మెడికల్ షాపుల్లో, పేషెంట్లకు అమ్ముతున్నట్టు తమకు సమాచారం అందిందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.