హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణను చూసి బీజేపీ నేతలకు కండ్లు కుడుతున్నాయి. అభివృద్ధిని ఓర్వలేక కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని సోషల్ మీడియాలో విష ప్రచారానికి బరితెగించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @BJP4India ఓ యానిమేషన్ వీడియో ను పోస్ట్ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ దుష్ప్రచారంపై తెలంగాణవాదులు, నెటిజన్లు మండిపడుతున్నారు. పథకా లకు కేంద్రం నుంచి నయాపైసా అందడంలేదని ‘ఫ్యాక్ట్‌చెక్ తెలంగాణ’ ఆధారాలతో ఎండగట్టింది. ఆసరా పింఛన్లలో కేంద్రం వాటా 1.79 శాతమేనని, 98.21 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని జవాబిచ్చింది.
కుందేలు మెదడున్న బీజేపీ నేతలకు ఏమీ తెలియదని, అందుకే చౌకబారు వీడియోలు తయారు చేసి జోకర్ల మాదిరిగా నవ్వులపాలవుతున్నారని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ధ్వజమెత్తారు. రైతు బంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ల లాంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సీమ్స్లో ఎవరైనా ఎలా అవినీతికి పాల్పడగలరని నిలదీశారు? ఈ పథకాలకు కేంద్రం నిధులు సమకూరుస్తున్నట్టు బీజేపీ అధికార యంత్రాంగం పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు. తెలంగాణ పథకాలను గొప్పగా ప్రచారం చేస్తున్న బీజేపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాలకు మోదీ సర్కారు సహకారం ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే అవినీతి అయితే మేం అవినీతిపరులమే’ అని ట్వీట్ చేశారు. బీజేపీ కుట్రలు తెలంగాణ ప్రజలకు తెలుసని, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నందుకు @BJP4India సిగ్గుపడాలని మరో ట్విట్టర్ యూజర్ మండిపడ్డారు. తెలంగాణలో నేరుగా గెలవలేమని బీజేపీకి తెలుసని, అందుకే చౌకబారు వీడియోలతో అవాకులు చెవాకులు పేల్చుతున్నదని ట్వీట్ చేశారు.