హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 10 (నమస్తే తెలంగాణ): బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి పంథా వారిది. కాకపోతే అవి ప్రజలు… అంతకుమించి సమాజానికి ఎంతవరకు మేలు చేస్తాయనేది ప్రధానం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే పాలకుడి ఆలోచనలు ప్రజలను వికాసం వైపు నడిపించాలేగానీ విధ్వంసం వైపు మళ్లించవద్దు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక ప్రాజెక్టును చేపట్టిన దాఖలాలు లేవనేది జగద్విదితం. ఈ నేపథ్యంలో రుణమాఫీ, ఇతర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బుల్డోజర్లతో హైడ్రామా సృష్టిస్తున్నది.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కొత్త రికార్డులు.. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చారిత్రక వృద్ధి అని మీడియాలో కథనాలు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక వారాంతంలో హైడ్రా ఐదు నిర్మాణాల్ని కూల్చివేస్తే, మరో వారంతంలో పది నిర్మాణాల్ని కూల్చి పంజా విసిరిందని విధ్వంసాన్ని ఆస్వాదించే పరిస్థితి ఏర్పడింది.
ఎవరిదీ పాపం?!
వాస్తవానికి హైదరాబాద్ మహానగరంలో వారసత్వంగా వచ్చిన చెరువుల్లో నాలుగింట మూడొంతులు సమైక్యపాలనలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. ఆరు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ వాస్తవాల్ని గుర్తించకుండా బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా ఆ ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో సామాన్యుడి గూడుపై తన ప్రతాపాన్ని చూపుతుంది. చెరువుల్ని పరిరక్షించడం అందరి బాధ్యత. కానీ దశాబ్దాల పాటు ఇదే కాంగ్రెస్ పాలకులు ఇష్టానుసారంగా చెరువుల కబ్జాను గుడ్లప్పగించి చూడటంతోపాటు కాంగ్రెస్ పెద్దలే లేక్‌వ్యూ విధానంలో గెస్ట్‌హౌస్‌లు, సౌధాలను నిర్మించుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు ముందుగా తమ అక్రమ నిర్మాణాల్ని కూల్చుకొని ఆపై ఇతరులపై కొరఢా ఝుళిపిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. కానీ కాంగ్రెస్ నేతల అక్రమాల వైపు కన్నెత్తి చూడని హైడ్రాకు కేవలం కొన్ని నిర్మాణాలే అక్రమంగా కనిపిస్తుండటం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తుంది.
ఏదీ ప్రణాళిక?
హైడ్రా ఒక చెరువును పరిరక్షించాలని నిర్ణయించుకున్నపుడు ముందుగా దాని ఎఫ్టీఎల్ను శాస్త్రీయంగా నిర్ధారించాలి. సంబంధిత శాఖ హద్దు రాళ్లను అమర్చాలి. ఆపై హైడ్రా రంగంలోకి దిగి అన్నింటినీ కూల్చివేస్తే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారని అనుకోవచ్చు. కానీ ఒక చెరువు పరిధిలో నాలుగైదు నిర్మాణాల్ని కూల్చడం, మిగతా వాటిని వదిలేయడం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంకోవైపు ప్రముఖులు ఉండే చోట నోటీసులు ఇచ్చి గడు వు ఇస్తున్న అధికారులు… నోటీసులు ఇవ్వకుం డా సామాన్యులపై మాత్రం సూర్యోదయానికి ముందుగానే బుల్డోజర్లతో విరుచుకుపడటం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. తొలుత కేవలం ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేస్తామన్న అధికారులు… ఒకచోట బఫర్‌జోన్‌లోనూ కూల్చివేతలు చేపట్టారు. ఇలా ఒక్కో చోట ఒకో రీతిలో ఎలాంటి ప్రణాళిక లేకుండా హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది.
ఇది కదా వికాసం…
ఆరు దశాబ్దాల సమైక్యపాలనలో చితికిపోయిన రైతన్న బతుకును బాగు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన బాహుబలి మోటారు ఇది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గాయత్రీ పంపుహౌజ్‌లో అమర్చిన 132 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మోటార్లు ఆసియా ఖండంలోనే అతి పెద్దవి. ఆపై ఇంతకంటే ఎక్కువ సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యంతో మోటార్లను ఏర్పాటు చేశారు. ఇలా పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం బీడు భూముల్లో పచ్చని సిరులు పండించేందుకు పోటీ పడి మరీ ఇలా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు భగీరథయత్నం చేసింది. అందుకే తెలంగాణ ఏర్పడేనాటికి 2014-15 సంవత్సరంలో తెలంగాణ పండించిన ధాన్యం 68.17 లక్షల టన్నులు. వాటి విలువ రూ.12,871.01 కోట్లు. 2022-23లో 278.30 లక్షల టన్నులతో రూ.54,546.80 కోట్ల ధాన్యాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.
ఇది కదా విధ్వంసం…
ఒక సౌధాన్ని నిర్మించాలంటే నెలలు పడుతుంది. కానీ అదే సౌధాన్ని కూకటివేళ్లతో పెకిలించాలంటే రెండు నిమిషాలు చాలు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇదే చూస్తున్నాం. గత తొమ్మిది నెలల కాలంలో ఒక ప్రాజెక్టు లేదు.. ప్రజల కోసం ఒక నిర్మాణాన్ని చేపట్టలేదు… భావితరాలకు పనికొచ్చే ఒక ఆలోచన అంతకన్నా లేదు… కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విధ్వంసాన్ని నమ్ముకున్నారు. ఆ పరంపరలో పేదోళ్ల గూడును బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ సర్కారు సమకూర్చిన బాహుబలి యంత్రం ఇదే. 36 మీటర్ల సామర్థ్యం ఉన్న ఈ యంత్రం పద్నాలుగు అంతస్తుల భవనాన్ని కూడా ఇట్టే కూలుస్తుంది. ఈ యంత్రం దేశంలో ఐదు చోట్ల మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, బెంగళూరుతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఒక ప్రైవేటు సంస్థ వద్ద ఉంది. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం సామాన్యుడి గూడును కూల్చివేసేందుకు ఈ యంత్రాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పటిదాకా ఉత్తరాదికే పరిమితమైన ఇది నేడు తెలంగాణకు పరిచయం చేసింది.