హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో మరో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు గవర్నర్ వద్దే ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నదని, ఆ బిల్లుకు ఆమోదం తెలుపగానే 1,062 పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు. మంగళవారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వర్సిటీల అధ్యాపక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆయా వర్సిటీల్లో ప్రధానంగా ఉన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లు ఆమోదం పొందగానే ఇప్పటికే ప్రకటించిన 1,062 అధ్యాపక ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. దాదాపు 2 వేల పైచిలుకు అధ్యాపక పోస్టులు భర్తీ అయితే.. రెండు దశాబ్దాల వరకు వర్సిటీల్లో విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని పేరొన్నారు. వర్సిటీల్లోని పలు అంశాలను, ఉస్మానియా వర్సిటీ ఉద్యోగుల సీపీఎస్, ఎరియర్స్ అంశాలను, టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఔటా వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జీ మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు సరస్వతమ్మ, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.