Vinod Kumar | రెండు నెలల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కి అనూహస్య స్పందన వచ్చిందని.. గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గులాబీ జెండా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఏడు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఈ సారి కరీంనగర్ ప్రజలు తనను ఎంపీగా ఆశీర్వదించబోతున్నారన్నారు. కాంగ్రెస్ ఐదునెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ విధ్వంసమైందని.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణలో సాగునీటి సమస్య, కరెంటు కోతలు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలడం మొదలైందన్నారు. కాంగ్రెస్ మార్పు తెస్తామని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు మోటర్, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోలేదని.. దాంతో తెలంగాణవ్యాప్తంగా ప్రజల్లో మళ్లీ కేసీఆర్ రావాలనే ఆకాంక్ష మొదైలందన్నారు. మళ్లీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కారు.. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో జూన్ 4న గులాబీ జెండానే మళ్లీ ఎగురుతుందని.. ఎంపీగా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని వినోద్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ కేబుల్ వంతెనపై లైట్లు వెలగని పరిస్థితి ఉందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌ని పట్టించుకోకుండా కాలికి వదిలేశారని.. ప్రజలకు అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో తేల్చుకోవాలన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కి జూన్ 2తో సమయం అయిపోతుందని… ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డి కలిసి హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కుట్రలు చేసి ఆగం చేస్తారన్నారు.
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని.. కరీంనగర్లో అభివృద్ధి చేయలేక, అభ్యర్థి ఫొటో లేకుండా మోదీ ఫొటో పెట్టి బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బొమ్మ లేకుండా దేశంలో ఎక్కడా ప్రచారం చూడలేదని.. మోదీ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణ హక్కుల కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం మోదీతో పాటు కేంద్రమంత్రుల దగ్గరికి చాలాసార్లు వెళ్లినట్లు వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ పార్టీ సమావేశాల్లో మాత్రమే మోదీని కలిశారని ఏ నాడు కూడా ఆలయాలకు.. అభివృద్ధి పనుల కోసం నిధులు అడగలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి.. పార్టీ మీటింగ్లకే బండి పరిమితమయ్యారన్నారు.
ఎప్పుడూ మతం, ధర్మం అని మాట్లాడే బండి సంజయ్ ఎన్నడూ తన పని సక్రమంగా నిర్వర్తించలేద.. బండికి మత విద్వేషాలు తప్ప అభివృద్ధి చేయడం, ప్రజలను గౌరవించడం తెలియదని అన్నారు. మోదీ ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ని కాపాడుకోవాలంటే కరీంనగర్లో ఎంపీగా ప్రజలు ఆశీర్వదించి తనను పార్లమెంట్‌కి పంపాలని అన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెచ్చి.. అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడించారు. వేములవాడకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ రాజన్న ఆలయానికి నిధులు కేటాయించపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న ఆలయానికి నిధులు కేటాయించడానికి హామీ ఇవ్వడానికి.. ఎన్నికల కోడ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. బండి సంజయ్ ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్యపెడతారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండికి ఓటమి తప్పుదని ప్రజలు అభివృద్ధికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.