కమలాపూర్, సెప్టెంబర్ 30: తనపై తానే దాడి చేయించుకోవడం ద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని ఈటల రాజేందర్ స్కెచ్ వేసినట్టు తమకు పక్కా సమాచారం ఉన్నదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలో ఎంపీపీ తడక రాణి, శనిగరం, మాదన్నపేట, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాలకు చెందిన 300 మంది బీజేపీ కార్యకర్తలు గురువారం టీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. ఓటమి ఖాయమైన ఈటల రాజేందర్ ప్రజల సానుభూతి పొందేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతున్నాడని చెప్పారు. ఈటల ఆడబోయే నాటకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేతులకో.. కాళ్లకో కట్లు కట్టుకొని వస్తడు.. టీఆర్ఎస్ దాడి చేయించిందని కొత్త నాటకమాడుతడు.. ప్రజల సానుభూతి పొందేందుకు కుట్ర పన్నుతున్నడు.. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ డ్రామా ఆడనున్నట్టు పక్కా సమాచారం ఉన్నది.. బీజేపీ నాయకులు బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నరు.. ప్రజలు గమనించాలె’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం లేకపోవడంతో ఎలాగైనా తమవైపు తిప్పుకొనేందుకు కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్ గుండెనొప్పి అని, దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు చేతికి కట్టు కట్టుకుని ఆడిన నాటకాలను ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హైదరాబాద్, కశ్మీర్, పాకిస్థాన్ సరిహద్దులో అల్లర్లు సృష్టించి, ప్రజల మెప్పు కోసం రెచ్చగొట్టే వాఖ్యలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ విష సంస్కృతి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ‘బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఏం చేసిండు? ఒక్క పనైనా చేసిండా?’ అని ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేసే టీఆర్ఎస్ కావాలా? మోసపు మాటలు చెప్పే బీజేపీ కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా టీఆర్ఎస్ నాయకులు సంయమనంతో, విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నాయకులను ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నాడని మండిపడ్డారు.
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్య ర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో మొదటిస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ సాధించిన రికార్డులను బీజేపీకి చెందిన కేంద్ర మం త్రులు ప్రశంసిస్తున్నారన్నారు. అన్ని రాష్ర్టాల్లో కంటే తెలంగాణలోనే గురుకులాల విద్య బాగున్నదని ఇటీవల బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొనియాడారని గుర్తుచేశారు. మూడేండ్లపాటు కరువొచ్చినా తట్టుకొనేంత నీరు తెలంగాణలో ఉన్నదని, ఇందుకు సీఎం కేసీఆర్ కృషే కారణమని వివరించారు. ఆత్మగౌరవం అంటే ఏమిటో ఈటల రాజేందర్ ఇప్పటివరకు చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఈటల రాక ముందే టీఆర్ఎస్ కమలాపూర్‌లో బలంగా ఉన్నదని, నాగలి గుర్తుపై అన్ని జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ స్థానాన్ని గెల్చుకున్నదని చెప్పారు. హుజురాబాద్‌లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కే ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, మండ ల ఇంచార్జి పేరియాల రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, స్వర్గం రవి, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, నవీన్‌కుమార్, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.