హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తేతెలంగాణ): రాష్ర్టానికి దశ, దిశ చూపేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత, మా జీ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, నాయకులు పట్నం మాణిక్యం, సీ కల్యాణ్‌రావుతో కలిసి గురువా రం విలేకరులతో మాట్లాడారు.
హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో కనీవిని ఎరుగని రీతిలో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నామని, సభకు తరలివచ్చే వారికి ఇలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చె ప్పారు. ఇప్పటికే 3వేల బస్సులను బుక్ చేశామని, వీటికి అదనంగా ప్రైవేట్ వాహనాలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇంటిపార్టీ పండుగకు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన పార్టీ, 25వ వసంతంలోకి అడుగుపెట్టడం గొప్ప విషయమని చెప్పారు. గతం లో ఇచ్చిన ప్రతి హామీని పార్టీ అధికారంలోకి వచ్చాక అధినేత కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడగడుగునా విఫలమైందని విమర్శించారు. రజతోత్సవ సభా వేదికగా కేసీఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ ప్రజానీకం ఉ త్కంఠ, ఉత్సుకతతో ఎదురుచూస్తున్నదన్నారు.
పహల్గామ్ ఘటనతో ఉగ్రవాద వికృతరూపం మరోసారి బట్టబయలైందని, ముష్కరుల మారణహోమం దారుణమని ఖండించారు. యావత్ సమాజం ఇలాంటి దేశ విద్రోహ చర్యలను ముక్తకంఠంతో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు కేంద్రం తీసుకునే ప్రతిచర్యకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
రేవంత్ గోబ్యాక్.. కేసీఆర్ కమ్‌బ్యాక్
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 24: రేవంత్ గోబ్యాక్.. కేసీఆర్ కమ్ బ్యాక్ అన్నదే సకలజనాభిప్రాయమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో జీవన్‌రెడ్డి పార్టీ నేతలతో రజతోత్సవ సభపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రేవంత్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం మూసీలో కలిసిపోయి ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణలక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24 గంటల కరెంట్, ఇంటింటికీ మిషన్ భగీరథనీళ్లు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థలలో సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
‘హలో విద్యార్థి-చలో వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో ‘హలో విద్యార్థి-చలో వరంగల్’ అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను గురువారం బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆవిష్కరించారు. ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ తుంగలో తొక్కిందని తుంగబాలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణభవన్‌లో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో రూపొందించిన చలో వరంగల్ పోస్టర్‌ను గురువారం ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిశోర్‌గౌడ్, ఫయాజ్, సేవాదళ్ అధ్యక్షుడు అమీర్అలీ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడారు. పార్టీ నాయకులు, సబ్బండవర్గాలు తరలివచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సభా ఏర్పాట్ల పరిశీలన
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను గురువారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సభావేదిక, హెలిప్యాడ్లు, తమ నియోజకవర్గాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
రైతుల బాధలు తెలిపేందుకే ఎడ్లబండ్ల ర్యాలీ
రాయపర్తి, ఏప్రిల్ 24 : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న బాధలను సబ్బండ వర్ణాల దృష్టికి తీసుకు రా వాలనే తలంపుతోనే సూర్యాపేట జిల్లా నెమ్మికల్ నుంచి 16 ఎండ్లబండ్లతో అన్నదాతలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గురువారం ఉదయం వరంగల్ జి ల్లా రాయపర్తి మండల కేంద్రానికి చేరుకున్న ఎడ్లబండ్ల ర్యాలీకి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వయంగా ఎడ్లబండిని నడుపుతూ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మీదుగా బీఆర్ఎస్ మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రజతోత్సవ స భకు గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు.