హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్ వాటర్ అండ్ క్లైమెట్ చేంజ్ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించారు. ప్లానింగ్ దశలో ఐదు అంశాలను తప్పనిసరిగా జోడించాలని పేర్కొన్నారు. భూమి, నీరు, గాలి, శక్తి, ఓపెన్ స్పేస్‌లను ఐదు అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. హెచ్‌సీయూ భూమి ప్రజల ఆస్తి అని, విద్యార్థులు చేసే ఆందోళనలకు ప్రజలు కూడా బాసటగా నిలవాలని కోరారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ధర్మకర్తలు మాత్రమేనని, యజమానులు కాదని చెప్పారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
బీవీ సుబ్బారావు: భూవినియోగం, సహజ వనరుల్లో తెలంగాణ రాష్ర్టానికి మంచి చరిత్ర ఉంది. అయితే ప్రభుత్వం చదును చేసేందుకు సిద్ధపడిన 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది కాదు.. హెచ్‌సీయూది కాదు.. అది ప్రజల ఆస్తి. ఆ ఆస్తిని కాపాడాటానికే మనం నాయకులను ఎన్నుకుంటున్నాం. అధికారంలోకి రాగానే ప్రజాపాలన అని దరఖాస్తులు తీసుకున్నారు. మరి ఈ అంశంపై ప్రజల్లో ఎందుకు చర్చ జరపలేదు. గచ్చిబౌలిలో నీళ్లు వెళ్లడానికి కాల్వలు లేవు. పరిపాలన దక్షత అంటే అన్ని అంశాలపై దృష్టి సారించడం. అయితే ప్రజాస్వామ్యంలో అన్ని ప్రజల ఆస్తులేనని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. మేజర్ భూమి వినియోగ మార్పుపై ప్రజల్లో, అసెంబ్లీలో ప్రభుత్వం ఎందుకు చర్చ జరపలేదు. క్యాబినెట్లో కూడా చర్చించకుండా ఎలా ముందుకు వెళ్తారు. ఎకరానికి రూ.100 కోట్ల చొప్పున ఆ భూమిని అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైతే అక్కడ స్కూళ్ల నిర్మాణానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? అంటే అక్కడి నుంచి పేద వాళ్లను తరిమేయడమే ఉద్దేశంలా కనిపిస్తున్నది. ప్రభుత్వాలు ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయాలి. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తామని హైడ్రా చెప్పింది. మరి ప్రక్షాళన ఎక్కడ జరిగింది?
బీవీ సుబ్బారావు: ఆఫ్రికా లాంటి దేశాల్లో అడవులపై కేస్ స్టడీలు చేస్తారు. తమ అడవుల్లో జంతువులు ఉన్నాయని, అవే పర్యాటక రంగానికి ఆర్థిక వనరులా ఉపయోగపడతాయని అక్కడి వాళ్లు భావిస్తారు. ఎకో పార్క్‌లు అని నగరానికి దూరంగా నిర్మించారు. అవే నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసి ఉంటే, అడవులు, జంతువులు నగరంలోనే ఉంటే ఎంత బాగుండేది. చిన్నారులు, ప్రజలు జంతువులను చూడటానికి ఇష్టపడుతున్నారు. మన దగ్గర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే వాళ్లు సరిగా లేరు. ప్రభుత్వం ఇంత ఒత్తిడితో ముందుకెళ్తున్నది అంటే ఇప్పటికే భూముల అంశంలో ఒప్పందాలు జరిగి ఉండాలి.
బ్యాంకులు అప్పులు ఇచ్చెటప్పుడు రిస్క్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. మరి బ్యాంకులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతనే రూ.వందల కోట్లు అప్పులు ఇస్తున్నాయా? గతంలో నాయకులకు అభివృద్ధి చేయాలనే తపన ఉండేది. ఇప్పుడు నీకెంత? నాకెంత? అనేవిధంగా రాజకీయాలు తయారయ్యాయి. ఆర్గనైజేషనల్ ఓపెన్ స్పేస్‌లు, పార్క్‌లు నగరానికి చాలా అవసరం. ప్రభుత్వ చర్యలతో అడవులు తగ్గిపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గతంలో మన దగ్గర అడవులు ఉండేవని భావితరాలకు చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. భూవినియోగ పద్ధతులపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరమున్నది.
బీవీ సుబ్బారావు: భూముల అమ్మకానికి నాడు చంద్రబాబునాయుడు విత్తనం వేశారని, అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. 400 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు బ్యాంకులో తనఖా పెట్టినట్టు సమాచారం ఉంది. అయితే ఆ భూమిపై జీహెచ్ఎంసీకే ప్రథమ హక్కు ఉంటుంది. జీహెచ్ఎంసీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం ఏంటీ? ప్రభుత్వం జీహెచ్ఎంసీని చెత్తబుట్టలో పడేసింది. నగరీకరణలో ఓపెన్ స్పేస్‌లు, నీటి వనరులు, ఆక్సిజన్, అడవులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో భూమి వినియోగంలో మార్పులపై చాలా నియమాలు ఉన్నాయి. గతంలో జూబ్లీహిల్స్ సొసైటీ అని ఉండేది. ఇంటి స్థలంలో 35 శాతం చెట్ల పెంపకానికి కేటాయించాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో ట్రాఫిక్ రోడ్డుల మీద బారులుతీరి కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి ప్రభావం మన కండ్ల ముందే కనబడుతున్నది. వర్షాలు పడితే ఇప్పటికే గచ్చిబౌలి నీళ్లు వెళ్లేందుకు కాల్వలు లేవు. ప్రభుత్వంలో జరుగుతున్న అనవసర ఖర్చుల తగ్గింపుపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఉచితాలపై కచ్చితంగా సమగ్ర చర్చ జరగాలి.
బీవీ సుబ్బారావు: జీవవైవిధ్యం ఉన్న ఈ భూములపై ప్రజల్లో చైతన్యం రావాలంటే శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు విస్తృతంగా ప్రచారం చేయాలి. రూ.100ల కోట్లు రుణాలు ఇస్తున్న బ్యాంకులను న్యాయవ్యవస్థ కూడా ప్రశ్నించాలి. భూములను అమ్మే ఆలోచన మొదటి నుంచి బీజేపీదే. 2000 సంవత్సరం మొదటి నుంచి ఈ భూముల అమ్మకం ప్రారంభమైంది. ఆ ప్రక్రియను ప్రస్తుత ప్రభుత్వం బాహాటంగా కొనసాగిస్తున్నది. ఈ భూముల్లో స్కూళ్లు కడతారా? ఆస్పత్రులు కడతారా? కాల్వలు కడతారా? అనే విషయంపై ప్రజలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇందిరాగాంధీ హయాంలో అటవీ ప్రాంతాలను సంరక్షించారు. తక్కువ మెజార్టీతో పీవీ నర్సింహరావు లోక్‌సభను నడిపించారు. 74, 72 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి లోకల్ గవర్నింగ్ బాడీస్లలో రిజర్వేషన్లు తీసుకువచ్చారు. అలాంటి నేతల నుంచి ప్రస్తుతం ఉన్న నేతలు ఏం నేర్చుకుంటున్నారు? లోక్‌సభ, అసెంబ్లీలో గెలిచిన నేతలకు గతంలో శిక్షణ ఇచ్చే కేంద్రం ఉండేది. దాన్ని సైతం ఎత్తేశారు.
బీవీ సుబ్బారావు: గ్లోబలైజేషన్ అని అమెరికా లాంటి దేశాల కంపెనీలకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. వాళ్లు మాత్రం మనవాళ్ల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి అవమానించేలా మన దేశానికి తిరిగి పంపేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా విధానాలు మారడంలేదు. అడవి భూములు అంతరించిపోవడంతో గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌పై ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది. గతంలో కమ్యూనిస్టు పార్టీలు ఇలాంటి అంశాలను ప్రశ్నించేవి. ప్రస్తుతం వారు సైతం మాట్లాడటం లేదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల ముందు అన్ని అంశాలను ఉంచే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. భూవినియోగంపై ప్రభు త్వం మరింత శ్రద్ధ వహించాలి. ప్ర భుత్వం ఇప్పటికైనా ప్రణాళికాబద్ధంగా పనిచేసి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లాలి.