హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ-క్యాటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్టలక్ష్మణ్ మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చాయని, యాజమాన్య కోటా సీట్లను లక్షలాది రూపాయలకు అమ్ముకుంటూ విద్యా వ్యాపారం చేస్తున్నాయని తెలిపారు. యాజమాన్య సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కళాశాలలపై ఏసీబీ, ఐటీ తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో లోక్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. సోమవారం రాజ్‌భవన్ పరిసరాలకు చేరుకున్న నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఎండీ అతిక్ అహ్మద్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజినీకాంత్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, వైఫల్యాలపై పోరాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు.