హనుమకొండ చౌరస్తా, జూన్ 10: ఓరుగల్లు అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్ అన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో మంగళవారం రీజినల్ స్పోర్ట్స్ స్కూల్స్సెలక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అజీజ్‌ఖాన్ హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. హనుమకొండను క్రీడాహబ్‌గా చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
హన్మకొండ జిల్లా యువజన, క్రీడాధికారి గుగులోతు అశోక్‌కుమార్ మాట్లాడుతూ హనుమకొండ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో 5 క్రీడాంశంలో శిక్షణ ఇస్తున్నామని, ఈ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాలల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ 5 క్రీడాంశంలో మిగిలిన సీట్ల కోసం క్రీడాకారుల ఎంపికలు మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్నట్లు, ఈ ఎంపికలకు తెలంగాణవ్యాప్తంగా సుమారు 300 మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్ అబ్జర్వర్లు డాక్టర్ రవికుమార్, నర్సింగరావు, స్వర్ణలత, సంతోష్, రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి కరీం, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.