హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై అజార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అజారుద్దీన్ క్రికెటర్‌గా 1984లో టీమిండియాలోకి అడుగుపెట్టారు. 90వ దశకంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. క్రికెట్‌కు వీడ్కోలు అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో యూపీలోని మొరాదాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ నియమించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్‌కు మైనార్టీ శాఖను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ హాజరుకాలేదు. శుక్రవారం సీఎం వరంగల్ పర్యటన ఏర్పాట్ల నేపథ్యంలో వారు కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి,సివిల్ సైప్లె చైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌రావు
శాసనసభ్యులైన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావును ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో నియమించింది. ఇద్దరికీ క్యాబినెట్ హోదా కల్పించింది. నిమాజాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ హోదాలో ఆయనకు క్యాబినెట్ సమావేశాలకు కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా అనుమతి ఉంటుంది. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయనకు వసతిని కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. ఆయనకు కూడా క్యాబినెట్ హోదా కల్పించింది.