హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బంజారాహిల్స్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందట! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ క్రీడ ఇట్లనే రంజుగా సాగుతున్నది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్, మైనార్టీ నేత అజారుద్దీన్ ఆదినుంచీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. గతంలో మద్దతుగా ఉన్న సీఎం రేవంత్ సైతం తనకు సహకారం అందిస్తారని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా సీఎం ఏకంగా ముగ్గురు మంత్రులను మోహరించి అజార్‌కు వ్యతిరేకంగా వ్యూహం రచించారు.
మొదట్లో కాస్త ఆచితూచి వ్యవహరించిన మాజీ క్రికెటర్ జూబ్లీహిల్స్ గల్లీల్లోకి వచ్చిన మంత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక లాభం లేదనుకొని యార్కర్ విసిరారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌తోనే భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్‌పై సంప్రదింపులు జరిపి ఆ ఫొటోలను బయటికి వదిలారు. పీసీసీ నుంచి తన పేరును పంపినా పంపకున్నా ‘బ్రో ఐ డోంట్ కేర్!’ అనే సంకేతమిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ విజయ దుందుబీ మోగించిన విషయం తెలిసిందే. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గ్రేటర్లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీ చివరికి మంత్రివర్గంలోనూ రాష్ట్ర రాజధానికి ప్రాతినిధ్యం కల్పించలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికతో ఖాతా తెరిచినా పార్టీ సమీకరణాలతో గ్రేటర్‌ను పరిగణలోకే తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇక్కడ గెలిస్తే కేవలం ఎమ్మెల్యేనే కాదు.. మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేసుకోవచ్చనే ఊహల పల్లకిలో పార్టీ ఆశావహులు తేలియాడుతున్నారు.
ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉన్న అజారుద్దీన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఝలక్‌లు ఇస్తూనే ఉన్నది. గతంలో తాను పోటీ చేసి ఓడిపోయిన దరిమిలా ఈసారి కూడా తానే అభ్యర్థినంటూ కొన్నిరోజుల కిందట అజార్ ప్రకటించారు. దీంతో టీపీసీసీ అతడిపై ఒంటికాలిపై లేచింది. సొం తంగా ఎలా ప్రకటన చేస్తారంటూ అల్టిమేటం ఇవ్వడంతో రాష్ట్ర పార్టీ ఆలోచన వేరుగా ఉన్నదనే వాస్తవాన్ని అజార్, ఆయన వర్గం గుర్తించింది. ఈ క్రమంలో ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఉప ఎన్నికలో తానే అభ్యర్థినంటూ అజార్ ప్రకటించుకోవడంతో అప్రమత్తమైన సీఎం, ఆయన వర్గం వెంటనే వ్యూహానికి పదును పెట్టింది. వాస్తవానికి సీఎం తనకు సన్నిహితుడైన ఫహీం ఖురేషీని రంగంలోకి దింపి, గెలిపించుకుంటే అటు గ్రేటర్, ఇటు మైనార్టీ కోటా నుంచి మంత్రివర్గంలోకి మార్గం సుగమమవుతుందని భావించారని పార్టీవర్గాలు చెప్తున్నాయి. కానీ మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ వ్యవహారం తెరపైకి రావడం అదికాస్తా సోనియా దాకా వెళ్లడంతో ఒక్కసారిగా ఖురేషీకి ద్వారాలు మూసుకుపోయాయని తెలుస్తున్నది. అజార్‌కు టికెట్ రావడం ఇష్టంలేని సదరు ‘ముఖ్య’నేత ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం.. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్టు! హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమీకరణాల నేపథ్యంలో అజార్ అంటే ఆది నుంచీ పడని మంత్రి వివేక్ ఒకడుగు ముందుకేసి ఆ బాధ్యతను భుజాన వేసుకున్నట్టు పార్టీవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.
ఇక అప్పటి నుంచి అజారుద్దీన్‌కు ఎలాంటి సమాచారం లేకుండానే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వివిధ రకాల కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అయినా అజార్ చివరి నిమిషంలో సమాచారం తెలుసుకొని వారిని కలుపుకొనిపోయే ప్రయత్నం చేసినా ఫలితంలేదని అజార్ వర్గం అంటున్నది. అంతేకాదు, నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించిన ముగ్గురు మంత్రుల మదిలో తలా ఒక ఆశావహుడు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తన సామాజికవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ ఒకరికి టికెట్ ఇప్పించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నోటి మాటగా సహకారం అందిస్తున్నారనే ప్రచారమున్నది. మంత్రి వివేక్ అజార్‌కు తప్ప ఎవరికైనా ఓకే అంటున్నారని చెప్తున్నారు. ఇక ఏడాదిన్నరగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని సమయం వచ్చినపుడల్లా తన అసంతృప్తిని వెల్లగక్కే అంజన్‌కుమార్ యాదవ్ కూడా అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
గతంలో పోటీ చేసి ఓడిపోయినందున సాంకేతికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా అజారుద్దీన్ అనేది నిర్వివాదాంశం. అయినా ముగ్గురు మంత్రులు అధికారికంగా నియోజకవర్గంలో పర్యటించి అజార్‌కు సమాచారం ఇవ్వకపోవడమనేది అటు సీఎం, ఇటు టీపీసీసీకి తెలిసే జరుగుతున్నదని అజార్ వర్గం వాదిస్తున్నది. ఈ క్రమంలో ఏం జరగనుందో ముందుగానే గుర్తించిన అజార్ వెంటనే అప్రమత్తమైనట్టు తెలుస్తున్నది.
ఇక్కడి వాళ్లతో ఇక లాభం లేదనుకుని ఏకంగా హస్తినలోనే పావులు కదిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలో సోనియా, రాహుల్‌తో భేటీ కావడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భేటీ ఫొటోలను అజార్ క్యాంపు నుంచి వెలువడినా.. పదిహేను నిమిషాల పాటు ఈ భేటీలో దేనిపై చర్చించారనే దానిపై క్యాంపు పెదవి విప్పకపోయినా జూబ్లీహిల్స్ అంశమనేది బహిరంగ రహస్యమే. అయితే సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఇన్చార్జి, ఇతర మంత్రులను ఎవరినీ కలవకుండా అజారుద్దీన్ నేరుగా అధిష్ఠానాన్ని కలిశారంటే ఇక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలన్నింటికీ చెక్ పెట్టాలనే హస్తిన వైపు అడుగు వేశారని పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.