హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ పాలకవర్గం నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మార్క్‌ఫెడ్ కేంద్ర కార్యాలయంలో చైర్మన్ మార గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని ఈ నేపథ్యంలో రైతులకు మరింత ప్రయోజనం కలిగించే విధంగా ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులకు లోనుకావాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచితే ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వినియోగాన్ని పెంచాలని, వచ్చే వానకాలం సీజన్‌కు ముందే ప్యాక్స్ వద్ద ఎరువుల నిల్వలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 9 మంది డీసీఎంఎస్ చైర్మన్లను మార్క్‌ఫెడ్ పాలకవర్గంలో ఎక్స్-అఫీషియో డైరెక్టర్లుగా తీసుకున్నారు. సమావేశంలో 2022-23 వానకాలం సీజన్ ఎరువులపై చర్చించారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్, టెస్కాబ్ డైరెక్టర్లతోపాటు పలువురు డీసీఎంఎస్ చైర్మన్లు, ఎక్స్ అఫీషియో డైరెక్టర్లు పాల్గొన్నారు.