గద్వాల/అలంపూర్, జూలై 25 : తెలంగాణ నీటి వనరులను దోపిడీ చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కుట్రను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బీఆర్ఎస్వీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలకేంద్రాల్లోని కళాశాలల విద్యార్థులకు బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి నది జల దోపిడీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి మాజ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీపై చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి వత్తాసు పలకడం సరికాదని తెలిపారు. నీటి వాటాల విషయంలో ఏపీ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ సారథ్యంలో నీళ్లు.. నిధులు.. నియామకాలే.. ఎజెండాగా బీఆర్ఎస్ పాలన సాగినట్టు గుర్తుచేశారు.