ఆర్మూర్, ఆగస్టు19: ఎవరి ఉజ్వల భవితకు వారే మార్గనిర్దేశకులని, అదృష్టంపై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషిచేస్తే అద్భుతమైన విజయాలు అందుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా చిట్ల ప్రమీల, జీవన్‌రాజ్ మోమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి ఆర్మూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సానుకూల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం తథ్యమని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడానికి గురువులు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బండరాయిని దేవుడిగా మలిచే శిల్పిని స్ఫూర్తిగా తీసుకొని.. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తూ సమాజానికి ఉత్తమ పౌరుడిని అందించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎదుగుదల నిలువెత్తు నిదర్శనమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ.. తాను పుట్టి పెరిగిన ప్రాంతం, చదువుకున్న బడిని మరిచిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరిట ట్రస్టును నెలకొల్పి అవార్డులు అందిస్తుండటం గొప్ప విషయమని కొనియాడారు.