హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ‘నమస్తే తెలంగాణ’ కార్టూన్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయ్కు అరుదైన అవార్డు లభించింది. ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ఎంబసీ భారత్-స్విస్ మైత్రీ అంశంపై నిర్వహించిన కార్టూన్ పోటీల్లో మృత్యుంజయ్ కార్టూన్‌కు బహుమతి వచ్చింది. దేశవ్యాప్తంగా వచ్చిన కార్టూన్లలో 19 కార్టూన్లను ఎంపిక చేసినట్టు, విజేతలకు నగదు పారితోషకం ఇవ్వనున్నట్టు స్విట్జర్లాండ్ ఎంబసీ కల్చరల్ ప్రోగ్రాం ఆఫీసర్ తనీమా మణికంటల తెలిపారు.
‘స్విట్జర్లాండ్-ఇండియా 75 : సక్సెస్ స్టోరీస్ టు బీ కంటిన్యూ’ పేరిట ఈ కార్టూన్లను కేరళ కార్టూన్ అకాడమీ సహకారంతో ఈ నెల 21 నుంచి 25 వరకు కొచ్చిలో జరిగే నేషనల్ కార్టూన్, క్యారికేచర్ ఫెస్టివల్ క్యారిటూన్లో ప్రదర్శించనున్నారు. లలితకళా అకాడమీ చైర్మన్ మురళి అధ్యక్షతన స్విట్జర్లాండ్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్యాట్రిక్ ముల్లర్ ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు. కల్చరల్ సెంటర్ డైరెక్టర్ అనిల్ ఫిలిప్, కార్టూన్ డైరెక్టర్ రతీశ్ రవి, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సుధీర్‌నాథ్, సెక్రటరీలు సతీశ్, బాలమురళీకృష్ణన్ పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రదర్శనను స్విట్జర్లాండ్‌లోనూ ప్రదర్శించనున్నట్టు తనీమా మణికంటల తెలిపారు.