ఖైరతాబాద్, సెప్టెంబర్ 27: గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ విమర్శలకు తావివ్వకుండా పరస్పరం చర్చించుకొని, ఇరు రాష్ట్రాల నీటి హకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘నీళ్లు ఆంధ్రాకు.. కన్నీళ్లు తెలంగాణకు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా నీటిని నిల్వ చేసుకొనే ప్రాజెక్టులు, బరాజ్‌ల నిర్మాణంలో గత ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదని విమర్శించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకు గోదావరిపై మధ్యలో తగిన బరాజ్‌లు, డ్యాంలు నిర్మించలేదని, దీంతో శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే మధ్యలో ఎక్కడా నిల్వ చేసుకొనే అవకాశం ఉండేది కాదని, నేరుగా ఆంధ్రాలోని ధవళేశ్వరం వరకు నీళ్లు వెళ్లిపోయేవని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్.. గోదావరి నదిపై అనేక ప్రాంతాల్లో బరాజ్‌లు, ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అనేక ప్రాజెక్టులు చేపట్టారని గుర్తుచేశారు. కడెం, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక బరాజ్, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీరు ఎకడ అందుబాటులో ఉంటే అకడే నిల్వ చేసి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వినియోగించేలా కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు.
మేడిగడ్డ దెబ్బతినడంపై అనేక ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయని ప్రకాశ్ పేర్కొన్నారు. మేడిగడ్డను బాంబులతో పేల్చేశారని తాను గతంలోనే ఆరోపించానని గుర్తుచేశారు. ఒకే ప్రాజెక్టు, ఒకే కాంక్రీట్, ఒకే నిర్మాణ విధానం జరిగినప్పుడు నాణ్యత లోపం ఉంటే మొత్తం నిర్మాణంపైనా ప్రభావం ఉండాలి కదా? ఒక నిర్దిష్ట ప్రాంతంలోని పిల్లర్లకే సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని వీరమల్ల ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉన్నదని, అందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. అనంతరం ఉన్నత విద్యలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జనగణనలో ఓబీసీ క్లాజ్, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును తక్షణమే ఆమోదించాలని తీర్మానించారు.