హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సింగరేణి ఓపెన్ కాస్ట్ (ఓసీ) గనుల్లో ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు తగుచర్యలు తీసుకోవాలని ఎంపీ, రక్షణ, సంక్షేమంపై పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యుడు బీ వెంకటేశ్ నేత కోరారు. శుక్రవారం నగరంలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్‌సేఫ్టీ (డీజీఎంఎస్) కార్యాలయంలో మైన్‌సేఫ్టీ అధికారులు, సింగరేణి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత సింగరేణి అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నదని కొనియాడారు. రక్షణ, సంక్షేమంలో కూడా అగ్రగామిగా ఉంటున్నప్పటికీ భూగర్భ గనులకన్నా ఓసీ గనుల్లో ప్రమాదాలు సంభవించటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఓబీ కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న కార్మికుల రక్షణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఓబీ కాంట్రాక్టర్లు చిన్నచిన్న కారణాలతో కార్మికులను తొలగించడం తగదన్నారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్లలో 12 ఓసీ గనులపై ఆయన సంబంధిత డైరెక్టర్లు, జీఎంలు, పీవోలతో చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ సింగరేణిలో రక్షణ చర్యలను మరింత పెంచడానికి కృషి చేయాలన్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ మాట్లాడుతూ స్థానిక యువతకు ఓబీ కాంట్రాక్టు పనుల్లో ఉపాధి కల్పించాలని కోరారు. సంస్థ తీసుకొంటున్న ఆధునిక రక్షణ చర్యలు, సంక్షేమం, ఆర్అండ్ఆర్ కార్యక్రమాలను సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ వివరించారు. కార్మికుల రక్షణ, ఆరోగ్యంపై ఖర్చుకు వెనుకాడకుండా సింగరేణి అనేక చర్యలు తీసుకొంటున్నదని, గనుల వద్ద అంబులెన్సులను ఏర్పాటు చేసిందని డైరెక్టర్ ఎన్ బలరాం తెలిపారు. గనుల్లో, కాలనీల్లో వెలుతురు పెంచేందుకు వేలాది ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశామని డైరెక్టర్ డీ సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఓసీ గనుల్లో ప్రమాదాల నివారణకు ఆపరేటర్స్ ట్రెయినింగ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లను కూడా సింగరేణి కొనుగోలు చేసిందని డీజీఎంఎస్ మలయ్ టికేదార్ వివ రించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్‌సేఫ్టీ అధికారులు సుప్రియో చక్రవర్తి, టీ శ్రీనివాస్, బిశ్వనాథ్ బెహర, సుంకి రత్నాకర్, డాక్టర్ కౌశిక్ సర్కార్, శ్యామ్ కుమార్ సోని తదితరులు పాల్గొన్నారు.