హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నది. రాష్ట్రంలో సగటున ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 83. ప్రభుత్వ పాఠశాలల్లో సగటున ఒక స్కూల్లో 72 మంది విద్యార్థులే ఉన్నారు. రాష్ట్రంలో 2,097 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 2వేల మంది టీచర్లు పని చేస్తున్నారు.
ఇతర దేశాల్లో ఎంతో మెరుగు..
ప్రపంచ వ్యాప్తంగా బడుల్లో సగటు విద్యార్థుల సంఖ్య 500లకు పైగానే ఉన్నది. అమెరికాలో ఒక స్కూల్లో సగటు విద్యార్థుల సంఖ్య 514కాగా, చైనాలోని ప్రాథమిక పాఠశాలల్లో 639, హైస్కూళ్లలో 895 మంది ఉన్నారు. యూకేలో ప్రాథమిక పాఠశాలల్లో 281మంది, సెకండరీ స్కూళ్లల్లో 989 మంది చొప్పున ఉన్నారు. మన దగ్గర పరిస్థితి చూస్తే స్కూళ్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ అన్నట్టుగా ఉన్నది. విద్యాశాఖ ఇష్టారీతిన ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు ఇస్తుండడంతో ఏటా 300 కొత్త స్కూళ్లు పుట్టకొస్తున్నాయి.
ఇదీ విద్యార్థుల పరిస్థితి..(2025 జనవరిలో)
రాష్ట్రంలో ఒక విద్యార్థి ఉన్న సర్కారు స్కూళ్లు 53 ఉండగా, ఇద్దరు ఉన్నవి 142 ఉన్నాయి. ముగ్గురు విద్యార్థులున్నవి 183 ఉంటే, వీటిలో 183 మంది టీచర్లు పనిచేస్తున్నారు. నలుగురు ఉన్నవి 247 ఉండగా, ఐదుగురితో నడుస్తున్నవి 280, ఆరుగురు ఉన్నవి 310, ఏడుగురితో నెట్టుకొస్తున్నవి 329 ఉన్నాయి. 8 మంది విద్యార్థులున్నవి 296, 10మంది విద్యార్థులతో నడుస్తున్నవి 291 ఉన్నాయి. రాష్ట్రంలో 26 వేల పైచిలుకు బడులుంటే 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లు 4,314 ఉండటం గమనార్హం. వీటిల్లో 3,326 టీచర్లు పనిచేస్తున్నారు.