హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కవితను విచారించేందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 5న సీబీఐకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
దీన్ని సవాల్ చేస్తూ 6న కవిత తరఫు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. కవితకు సీబీఐ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆమెను విచారించేందుకు దరఖాస్తు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణపై స్టేటస్కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
అందుకు కోర్టు తిరస్కరిస్తూ.. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇంతలోనే సీబీఐ అధికారులు శనివారం జైలులో కవితను ప్రశ్నించడం సరికాదని ఆమె తరఫు న్యాయవాదులు బుధవారం కోర్టుకు తెలిపారు. కవిత పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా సీబీఐ నడుచుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకే జైలులో కవితను ప్రశ్నించామని, కనుక ఆమె పిటిషన్‌పై తాము కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
దీనిపై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు జోక్యం చేసుకొంటూ.. విచారణపై సీబీఐ తమకు ఎలాంటి రిైప్లె ఇవ్వలేదని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఇకపై సీబీఐ చేపట్టే విచారణకు ముందస్తుగా అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా అడగాలని కవిత న్యాయవాదులకు సూచించారు. అయితే, సీబీఐ రిైప్లె ఇవ్వకపోవడంపై తమ వాదనలు వినిపిస్తామని మోహిత్‌రావు తెలిపారు. అందుకు అనుమతించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.