హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : అటానమస్ కాలేజీల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అటానమస్ కాలేజీ అఫైర్స్ డైరెక్టరేట్ విషయంలో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విభాగాన్ని ఏకంగా రద్దుచేసి, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్ సెల్లో విలీనం చేసింది. గతంలోనే వర్సిటీ పాలకమండలిలో నిర్ణయం తీసుకోగా, తాజాగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర్రావు ఉత్తర్వులు జారీచేశారు.
ఇక నుంచి ఒక్కరే డైరెక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. అటానమస్ కాలేజీ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బీ రవీంద్రారెడ్డిని బదిలీచేసి, కూకట్‌పల్లిలోని యూనివర్సిటీ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ నిర్ణయంపై తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోశ్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు.