ల్లెందు, మే 28 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బా నోత్ హరిప్రియ నాయక్ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణంలో పాసి దుర్గాప్రసాద్ అనే ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. బుధవారం మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి ఆటో కార్మికులను మర్చిపోవడం సరికాదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికీ అతీగతీలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలు సరిగా నడవక ఆటోడ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే దుర్గాప్రసాద్ మృతిచెందాడని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. యూనియన్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి దుర్గాప్రసాద్ మృతదేహంతో ఇల్లెందు ప్రభుత్వ దవాఖాన నుంచి జగదాంబ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.