ఖలీల్వాడి, డిసెంబర్ 7: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ వాహన కంపెనీలతో కొలువుదీరిన ఈ ప్రదర్శనను మేయర్ నీతూకిరణ్ ప్రారంభించారు. అనంతరం అన్ని స్టాళ్లను సందర్శించి, అధునాతన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఆటో షోను నిజామాబాద్ లాంటి నగరాల్లో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. నాలుగోసారి విజయవంతంగా వాహన ప్రదర్శన నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాన్ని ప్రశంసించారు. రెండురోజులపాటు నిర్వహించనున్న ఆటో షోను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులను కోరారు.
తొలిరోజు ఆటో షోకు విశేష స్పందన వచ్చింది. ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది. ప్రధానంగా మహిళలు ద్విచక్ర వాహనాలు, కార్లు ట్రయల్ చేసేందుకు ఉత్సాహం చూపారు. వాహనాల విక్రయాలు, బుకింగ్లు జరగడం ఆయా కంపెనీల సిబ్బందికి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎస్బీఐ డీజీఎం బిజయ్ సాహు, ఆర్ఎం మహేశ్వర్, యూబీఐ ఆర్ఎం అరుణ సునీత, డిప్యూటీ రీజినల్ హెడ్ ప్రవీణ్ వేణుగోపాలన్, నమస్తే తెలంగాణ నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.