హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సాయం అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీకి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. జేఏసీ నేతలు ఆటో, స్కూల్ వ్యాన్లు, యాప్ ఆధారిత వాహనాల సేవలను నిలిపివేస్తూ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం రాత్రి మంత్రి పొన్నం వారితో చర్చల్లో పాల్గొన్నారు.
ఆటో చార్జీల సవరణ, డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థికసాయం, ప్రమాద బీమా, పర్మిట్లు, అగ్రిగేటర్ సేవలు తదితర అంశాలపై చర్చ జరిగింది. పొన్నం పలు హామీలు ఇవ్వడంతో ప్రభుత్వం, మంత్రిపై నమ్మకంతో జేఏసీ నేతలు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నేతలు హామీ పత్రం తీసుకున్నట్టు తెలిసింది.
ఆటో చార్జీల సవరణ కోసం ఇప్పటికే వరింగ్ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు రవాణాశాఖ తెలిపింది. ఈ కమిటీ ప్రతిపాదనలను 15 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లకు ప్రమాదం, సహజ మరణం సందర్భాల్లో బీమా సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిశీలించనున్నట్టు చెప్పారు. రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాన్ని కార్మికశాఖతో కలిసి ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిశీలిస్తామని, ఈ అంశంపై కార్మికశాఖ మంత్రితో సంయుక్త సమావేశాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్టు పేరొన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆటో సేవలకు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలన్న జేఏసీ ప్రతిపాదనపైనా చర్చ జరిగింది.
ఈ విషయాన్ని ఐటీ శాఖతో చర్చించి ముందుకు తీసుకెళ్లనున్నట్టు రవాణా శాఖ తెలిపింది. జీవో నంబర్ 263 కింద తిరసరించిన కేసులు, గడువు ముగిసిన అనుమతులకు సంబంధించిన కేసులను పరిశీలించి ఆటోరిక్షా పర్మిట్ కోటాను విడుదల చేయనున్నట్టు శాఖ వెల్లడించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టి చివరి మైలు కనెక్టివిటీ విధానాన్ని రూపొందించబోతున్నారన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ఆటో కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రమేశ్, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య, వెంకటరమణ, యూనియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.