ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 24: మహానగరంలోనే కనిపించే ఆటో ఎక్స్‌పోలు ఖమ్మం నగరంలో సబ్బండ వర్గాల దరికి చేరాయని, ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందనలు తెలిపారు. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఆటో ఎక్స్‌పోకు విశేష స్పందన లభించింది. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరై వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వివిధ మోడళ్ల వాహనాలను పరిశీలించిన వాటి ఫీచర్స్, మన్నిక తదితర వివరాలు తెలుసుకున్నారు. ఎక్స్పో ద్వారా చేకూరిన ప్రయోజనం, నగరవాసుల నుంచి వచ్చిన ఆదరణ తదితర అంశాలపై ఆరా తీశారు. కొన్ని బైకులను టెస్ట్ రైడ్ చేశారు. అనంతరం జరిగిన సభలో సందర్శకులు, కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, రాష్ట్ర ఆవిర్భావం తరువాత ‘నమస్తే తెలంగాణ’ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర సాధన తరువాత తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా వార్తా కథనాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తున్నదని చెప్పారు. దీంతోపాటు సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు సహా అనేక రంగాల ప్రజల ప్రయోజనార్థం ప్రాపర్టీ షోలు, ఆటో ఎక్స్పోలను ఏర్పాటు చేస్తుండటం సంతోషదాయకమని అన్నారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటుచేసిన వివిధ కంపెనీల ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఖమ్మం యూనిట్ మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటుచేసిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండు రోజులపాటు కొనసాగిన వాహనాల ప్రదర్శన, విక్రయాల ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, వాహన వినియోగదారుల సౌకర్యార్థం ‘నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కొంతకాలంగా ఎక్స్‌పోలు నిర్వహిస్తూ ఇటు బహుళజాతి కంపెనీల కార్లు, బైకులు అందుబాటులో ఉంచి అదే వేదికపై బ్యాంకర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి మేళాకు సదరు కంపెనీలకు సైతం మంచి ఆదరణ వస్తుండటంతో ఈ ఏడాది కూడా మరోమారు ఆటోషో ఏర్పాటుచేశారు. దీనికి మీడియా పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్టనర్‌గా సుమన్ టీవీ సహకారాన్ని అందించాయి. స్టాళ్లను సందర్శించిన ప్రతి ఒక్కరికీ కూపన్లు అందజేసిన నిర్వాహకులు.. గంటకోసారి లక్కీడిప్ తీశారు. విజేతలకు అక్కడే బహుమతులు అందజేశారు.