హైదరాబాద్ సిటీబ్యూరో/కవాడిగూడ, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ ) : ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయాలని, ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఐఎల్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎల్డబ్ల్యూఎఫ్ చైర్మన్ ఇనాయత్ అలీబాక్రీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.12వేల జీవనభృతి హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
ఆటోడ్రైవర్లపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం, వారి సంక్షేమానికి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నగరంలో ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలను అరికట్టాలని కోరారు. ఆటోడ్రైవర్లపై ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఏపీలోని ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర ద్వారా రూ.15వేలు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని, చంద్రబాబు తన గురువని చెప్పుకునే శిష్యుడు రేవంత్రెడ్డి.. తెలంగాణలోని ఆటోడ్రైవర్లకు జీవన భృతి రూ.12వేలు ఎప్పుడిస్తారో చెప్పాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గురువు చేస్తున్న పనిని చూసైనా శిష్యుడు ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి ఆటోడ్రైవర్ల ఉపాధిని దెబ్బతీశారని, ఇప్పటికే చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు.